Bike Accident in Palnadu District : తన కుమారుడిని చూసేందుకు వచ్చింది ఆ తల్లి. కుమారుడిని చూసి సంతోషంతో మురిసిపోయింది. కుమారుడితో రెండు రోజులు ఉండి బాగోగులు తెలుసుకుంది. త్వరగా వెళ్లాలి, డ్యూటీకి లేటవుతుందంటూ బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై కూర్చొని బయలుదేరింది. అదే ఆమె చివరి రోజైంది. దారి మధ్యలో ఆమె చీరకొంగు బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుంది. ప్రమాదానికి గురై క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాసరి శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసే వారు. ఆయన దురదృష్టవశాత్తు 2009వ ఏట గుండె నొప్పితో మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఆయన భార్య దాసరి సుస్మిత (49)కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్కడే అద్దెకు నివాసం ఉంటున్నారు.
మృతురాలు దాసరి సుస్మిత (పాత చిత్రం) (ETV Bharat) చీర కొంగు తీసిన ప్రాణం : రెండు రోజుల క్రితం కుమారుడు ధనుష్ వాత్సవ్‌ను చూసేందుకు గుంటూరు జిల్లాలోని నల్లపాడుకు వెళ్లారు. గురువారం (నవంబర్ 14) తన విధులకు హాజరవ్వాలని బయలుదేరారు. బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై నల్లపాడు నుంచి పేరేచర్ల చౌరస్తాకు వెళుతున్నారు. మార్గ మధ్యలో ఆమె చీర కొంగు వాహనం వెనక చక్రంలో ఇరుక్కుంది. దీంతో ఒక్కసారిగా సుస్మిత కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మేడికొండూరు పోలీసులు స్పాట్‌ను పరిశీలించి కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు చేసేటప్పుడు చీర కొంగు, చున్నీల వంటివి చేతితో జాగ్రత్తగా పట్టుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే ప్రమాదాలు సంభవించి జీవితాలు తలకిందులవుతాయని తెలిపారు.
బైక్ చైన్‌లో చున్నీ చిక్కుకుని తెగిపోయిన చేయి - ఏం జరుగుతుందో తెలిసేలోపే జీవితం తారుమారు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి