Vijayawada Murder Case: డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన భార్య పీక కోసి హతమార్చిన ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కంసాలిపేటకు చెందిన షేక్ బాజీ, నగీన(32)లకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక బాబు ఉన్నాడు. భర్త పెయింటింగ్ పని, భార్య స్థానికంగా సమోసాల తయారీ కేంద్రంలో పని చేస్తోంది. భర్త మద్యానికి బానిసై కొద్ది రోజులుగా పనికి సరిగ్గా వెళ్లడం లేదు. అప్పులు చేస్తూ తరచూ భార్యను డబ్బులు కావాలంటూ వేధిస్తు ఉండేవాడు.
బుడమేరులో వరదలు వచ్చిన దగ్గర నుంచి స్పిరిట్, సొల్యూషన్ తాగేందుకు అలవాటు పడ్డాడు. నాలుగు రోజుల క్రితం రూ.5 వేలు కావాలని భార్యను అడిగాడు. ఆమె డబ్బులు మద్యం కోసం అడుగుతున్నాడని నిరాకరించడంతో గొడవ పడ్డాడు. ఆ తరువాత నగీన పక్కవీధిలో ఉండే తన అక్క సాబీర దగ్గరకు వెళ్లింది. సాయంత్రం పని అయిపోగానే ఇంటికి వెళ్లి రాత్రికి పడుకోవడానికి సాబీర దగ్గరకు వస్తుంది.
కత్తితో హతమార్చి: ఈ క్రమంలో ఈ నెల 21 వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు పనికి వెళ్లి ఓ గంట విశ్రాంతికి సమయం ఉండడంతో ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చింది. అప్పటికే మత్తులో ఉన్న భర్త బాజీ ఆమెతో గొడవపడి కొట్టాడు. దీంతో ఆమె తన సోదరి సాబీరకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇంతలోనే ఇంట్లో ఉండే ఉల్లిపాయలు కోసే కత్తితో బాజీ పరమ కిరాతకంగా భార్య పీక కోశాడు. ఆమె కేకలు వేస్తూ రక్తపు మడుగులో విలవిల కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందింది.