9 Women Helps To Poor People : యూఎస్‌లోని టెనసీ ప్రాంతంలో 4 అక్కాచెల్లెళ్లు ఉండేవారు. వాళ్లకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్దనే పెరిగారు. వాళ్లిద్దరూ దానగుణమున్నవారే. దాంతో తెలియకుండానే వీళ్లకి కూడా ఆ భావాలు అలవడ్డాయి. ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు నలుగురూ పెరిగి, పెద్దయి జీవితంలో స్థిరపడ్డారు. అయితే, రోజూ వార్తల్లో కనీస అవసరాలు లేక ఇబ్బందిపడే వారి గురించి విన్నప్పుడల్లా వీరికీ తమవంతుగా ఏదైనా సాయం చేయాలనిపించిందట.
ఎంతోమంది అన్నార్తులకు ఆకలి తీర్చారు :దాంతో ఈ 4 అక్కాచెల్లెళ్లు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ‘9 నానాస్’ అనే ఒక రహస్య గ్రూపుగా ఏర్పడ్డారు. లాండ్రీ లాంటి పనులు సొంతంగా చేసుకుని ప్రతినెలా కొంత ధనాన్ని పొదుపు చేసుకునేవారు. ఆ సొమ్ముతో ఎవరికివారే ఇంట్లోనే కేకులు తయారుచేసేవారు. అందరూ ఉదయాన్నే 4గంటలకే నిద్రలేచి ఓ చోట సమావేశమయ్యేవారు. వాళ్లు తయారుచేసిన కేకులు, పెరుగును ప్యాక్ చేసి పేదవారికి, ఒంటరి తల్లులు, వృద్ధులు ఇలా అవసరమున్న వారికి పంచి తెల్లారేలోగా ఇంటికి చేరుకునేవారు. ఒక్క కేక్ మాత్రమే కాదు, సరకులు, దుస్తులు లాంటివి కూడా అందించేవారు. వాళ్లిచ్చే ఆ ప్యాకెట్ మీద 'సమ్‌బడీ లవ్స్ యు' అని నోట్ కూడా రాసి ఉంచేవారు. ‘మనల్ని ప్రేమించేవారూ ఈ సమాజంలో ఉన్నారని వాళ్లు ఫీల్ అవ్వడాన్నీ, వారి ముఖం మీద నవ్వుల్ని చూడాలన్నదే వీరి తాపత్రయం.
గత ముప్పై ఎళ్లుగా భర్తలకు కూడా తెలియకుండా :ఈ సేవాకార్యక్రమాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసేవారు. చివరికి వాళ్ల భర్తలకు కూడా. అలా వీళ్లు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 30ఏళ్లకు పైగానే ఈ రహస్య సేవా కార్యక్రమాలను కొనసాగించారు. అయితే, తొమ్మిది మందిలో ఒకరైన మేరీ ఎలెన్ అనే మహిళ భర్త ఒకరోజు దీన్ని గమనించారు. దాంతో ఆ సీక్రెట్ ఆపరేషన్ గురించి చెప్పక తప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న వారి భర్తలు ఆశ్చర్యపోయారు.