AP Liquor Shops Lottery on Monday :ఏపీ వ్యాప్తంగా 3396 లిక్కర్ షాపులకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అప్లికేషన్ ఫీజు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా అప్లికేషన్లు రాగా, వాటిని పునఃపరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాల్లోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు వచ్చాయి.
సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తు దారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 15న ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ షాపులను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ లిక్కర్ బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్‌ను 99 రూపాయలకే అమ్మేలా సవరణ చేసింది.
Andhrapradesh Liquor Prices 2024 : ఈమేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా రిలీజ్ చేశారు. అదననపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ ఏపీ సర్కార్ సవరణ చేసింది.