Khairatabad Ganesh 70 Years History : గణపతి బప్పా మోరియా అంటూ ప్రతి ఏడాది పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతాయి. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కి బారులు తీరుతారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడికి దశాబ్దాల చరిత్ర ఉంది.
ఒక్క అడుగుతో ప్రారంభం : 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్‌లో గణేశ్ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాద్‌కి చెందిన సింగరి శంకరయ్య, 1954లో మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి ప్రయాణం, నాటి నుంచి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చాడు.
70 ఏళ్లు పూర్తి : ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమైనదే. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ, భక్తులను ఆకట్టుకుంటున్నాడు. 2014వ సంవత్సరం నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని, ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకూ ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకొచ్చారు. అయితే భక్తుల కోరిక తిరిగి 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే 2020లో కొవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా, గత ఏడాది 63 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు.