640 Tonnes of PDS Rice Seized in Kakinada :ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని (పీడీఎస్) పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తూనే ఉన్నారు. బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కలెక్టర్ షాన్ మోహన్ 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షలు : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. కాకినాడలోని యాంకరేజీ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం తరలిపోతూనే ఉంది. బియ్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పోర్టులో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బార్జిలు నిలిపే ప్రాంతం నుంచి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సుమారు గంట పాటు సముద్రంలో ప్రయాణించి, పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు. నౌకలోని ఐదు గదుల్లో నిల్వ ఉంచిన నిల్వల నమూనాలు సేకరించారు. అనుమానం ఉన్నవాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు.
పీడీఎఫ్ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్
త్వరలో నిర్ణయం తీసుకుంటాం : కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడు అయ్యిందని అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో నిర్వహించిన తనిఖీల్లో సీజ్ చేసిన పేదల బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేశామని, పట్టుకున్న బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయని అన్నారు. అక్కడ ఉన్న మిగిలిన నిల్వలు బాయిల్డ్ రైస్‌గా పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యంపై రసీదులు తనిఖీ చేశాక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.