Tirupati District Police Arrest Gang involved in Digital Arrest : డిజిటల్ అరెస్ట్! కొన్ని రోజులుగా ఈ పేరు వింటేనే దడ పుట్టేలా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఉన్నచోట నుంచి కదలనివ్వరు, ఊపిరి ఆడనివ్వరు. భయపెట్టడం, బెదిరించడమే వారి పెట్టుబడి. పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి మాయం అయిపోతారు. ఇప్పుడు మరీ బరితెగిస్తూ నకిలీ పోలీస్ స్టేషన్లు, ఫేక్ కోర్టులతోనూ బేజారెత్తిస్తున్నారు. కస్టమ్స్‌లో మీ పార్శిళ్లు పట్టుకున్నారనో, మనీ ల్యాండరింగ్, అయినవాళ్లు తీవ్ర నేరాల్లో ఇరుక్కున్నారనో, డ్రగ్స్, ఉగ్రవాద కేసుల్లో విచారిస్తున్నామనో ఇలా రోజుకో వేషం, పూటకో మోసంతో నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా డిజిటల్ ముసుగులో ఓ మహిళ కోట్లు పొగొట్టుకుంది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
సీబీఐ అధికారుల మంటూ వాట్సాప్ కాల్ : తిరుపతి జల్లా ఇన్‌ఛార్చ్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపిన వివరాల ప్రకారం, "తిరుపతి త్యాగరాజనగర్ కు చెందిన ఓ మహిళకు దిల్లీ సీబీఐ అధికారుల మంటూ ఓ ముఠా వాట్సాప్ కాల్ చేశారు. మనీ ల్యాండరింగ్ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ కోసం బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని మహిళను బెదిరించారు. భయందోళకు గురైన మహిళ వారు అడిగిన వివరాలు చెప్పింది. దీంతో మహిళ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు 2 కోట్ల 50లక్షల రూపాయలను దోచుకున్నారు" అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.
ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు : అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్, అతని సోదరుడు విశాఖకు చెందిన అరుణ్ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వినయ్ కుమార్ ను అరెస్ట్ చేసి 24.5లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్స్, ఒక కారు, 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేసినట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వివరాలను కొత్తవారితో పంచుకోవద్దన్నారు. అనుమానిత వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే 8099999977 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఇన్‌ఛార్చ్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.
దేశంలోనే తొలిసారి - ‘డిజిటల్ అరెస్ట్’ మోసగాళ్లకు బేడీలు
సైబర్ నేరాల్లో 'గోల్డెన్ అవర్' - ఇలా చేస్తే పోగొట్టుకున్న డబ్బులు గంటలోనే రిటర్న్