39 Special Police Constables Were Suspended in Telangana :తెలంగాణ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 39మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. క్రమశిక్షణ శాఖలో పని చేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రహదారులపైకి వచ్చి ధర్నాలు చేయడం, సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సెలవుల విషయంలో ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నా, ఇంకేమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీజీపీ జితేందర్ సైతం చెప్పినా ఆందోళనలు కొనసాగించడం సమంజసం కాదని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలానే కొనసాగితే అవసరమైతే మరింత కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
39 మంది కానిస్టేబుళ్లు సస్పెండ్ : ఇలా ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో 3వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 4వ బెటాలియన్‌లో ఆరుగురు, 5వ బెటాలియన్‌లో ఆరు, 6వ బెటాలియన్‌లో ఐదుగురు, 12వ బెటాలియన్‌లో ఐదుగురు, 13వ బెటాలియన్‌లో ఐదుగురు, 17వ బెటాలియన్‌లో ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.