Stray Dogs Have Bitten 3 Lakh People In GHMC : హైదరాబాద్ నగరంలో కుక్కల సంఖ్యతోపాటుగా కుక్కకాటు ఘటనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,36,767 మందిని కుక్క కరిచిన కేసులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నమోదయ్యాయి. అందులోని కొన్నికేసులు పిల్లులు, కోతులు కరిచినవి కూడా ఉన్నట్లు, జీహెచ్‌ఎంసీ తెలిపింది. జీహెచ్‌ఎంసీ వెల్లడించిన లెక్కలు పరిశీలిస్తే, గడిచిన పదేళ్లలో వీధికుక్కల సంఖ్య దాదాపు స్థిరంగా ఉన్నా, అవి దాడి చేసే ఘటనలు పెరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నగరంలో సుమారు 6 లక్షల శునకాలున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంటుంది. ఏడేళ్ల క్రితం 5.8 లక్షలున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే వాటి సంఖ్య పెరగడమేగానీ, తగ్గటంలేదు. మరోవైపు వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తుంది. గడిచిన రెండేళ్లుగా రూ.11.5 కోట్ల వార్షిక వ్యయాన్ని అధికారులు లెక్కల్లో చూపించారు.
మొత్తం ఐదు జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజూ సుమారు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా సంతతిని కట్టడి చేస్తున్నామని అంటున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు అధికారులు చెబుతున్న దానికి విరుద్ధంగా ఉంది. ఏ వీధిలో చూసినా ఐదు నుంచి పది శునకాలు దర్శనమిస్తున్నాయి. బడికెళ్లే పిల్లలు, పాదచారులు, వృద్ధులు, మహిళలను కరుస్తున్నాయి. కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి వెంట పడుతున్నాయి. గడిచిన పదేళ్లలో జీహెచ్‌ఎంసీకి 3,60,469 ఫిర్యాదులు వచ్చాయి.