IAS TRANSFERS in AP :గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతల అండ చూసుకుని రెచ్చిపోయిన అధికారులపై వేటు తప్పదని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒకేసారి 21 మంది కీలక అధికారులకు స్థానచలనం కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన సీనియర్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. కీలకశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న పలువురిని బదిలీ చేశారు.
- శ్రీలక్ష్మి :జగన్ అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చారు. కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెకు సీఎం జగన్ చకచకా పదోన్నతులు కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని చేశారు. పురపాలకశాఖ బాధ్యతలు చేపట్టిన ఆమె అమరావతి విధ్వంసం, రుషికొండపై జగన్ కోసం విలాసవంతమైన భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా ఆమెపై బదిలీ వేటు వేస్తూ సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
- ప్రవీణ్ ప్రకాశ్ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరి చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాశ్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ కోసం రుషికొండపై విలాసవంతమైన భవనాల నిర్మాణానికి గుజరాత్ నుంచి ప్రముఖఆర్క్‌టెక్ట్‌ను తీసుకురావడంలో ఆయనదే కీలక పాత్ర. పాఠశాల విద్యాశాఖనూ, అస్తవ్యస్త నిర్ణయాలతో భ్రష్ఠుపట్టించారన్న ఆరోపణలున్నాయి.
- రజత్ భార్గవ :మరో కీలక అధికారి రజత్ భార్గవ ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. జే-బ్రాండ్‌ల మద్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన అడ్డగోలు దోపిడీకి పూర్తిగా సహకరించారనే ఆరోపణలున్నాయి.
- వివేక్ యాదవ్, హరిజవహర్‌లాల్ :అలాగే సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న మరో వివాదాస్పద అధికారి వివేక్ యాదవ్‌తోపాటు, కార్మికశాఖ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం - AP New DGP Dwaraka Tirumala
గోపాలకృష్ణ ద్వివేదీ, ప్రవీణ్ కుమార్ :బదిలీల జాబితోలో వైఎస్సార్సీపీ హయాంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ, ప్రవీణ్ కుమార్‌లకు కీలకశాఖల బాధ్యతలు అప్పగించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ద్వివేదిని కార్మికశాఖకు బదిలీ చేశారు. అలాగే, గతంలో పనిచేసిన గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగించారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్‌ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తిరుపతి కలెక్టర్‌గా వెళ్లిన ప్రవీణ్ కుమార్ అంతకుముందు పురపాలకశాఖ కమిషనర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి కనుసన్నల్లో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి అధికారికి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.