19 Pairs of Twins in Nizamabad School : కవలలను ఒకటి లేదంటే రెండు జంటలనో చూస్తుంటాం. కానీ పదుల సంఖ్యలో కవల పిల్లలను ఒకేచోట చూస్తే ఏర్పడే గందరగోళం అంతా ఇంతా కాదు. కానీ ప్రతిరోజూ ఇంత మంది పిల్లలు ఒకే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని విక్టరీ హైస్కూల్లో ఎల్కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 19 కవల పిల్లల (Twins Stories) జంటలున్నాయి. అంటే 38 మంది కవల పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు.
అప్పుడు ఒకే కాన్పులో జననం- ఇప్పుడు ఒకే గేమ్‌లో పతకాల పంట- త్రీ సిస్టర్స్ కథ ఇదీ!
రోజు పాఠశాల సిబ్బందిని, తోటి విద్యార్థులను ఈ కవల జంటలు తికమక పెడుతూ సందడి చేస్తున్నారు. కవలలందరూ ఒకే రకమైన దుస్తుల్లో రావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు సైతం తికమకకు గురవుతున్నారు. పాఠశాలలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బంధువులు, గ్రామస్థులు తమను గుర్తించడంలో తికమక పడుతుంటారని చిన్నారులు అంటున్నారు. చదువుతో పాటు అల్లరిలోనూ ఏ పని చేసినా ఒకే రకంగా, ఒకే మాదిరిగా ఉంటామని కవల పిల్లలు చెబుతున్నారు.
"మేము కవలలుగా పుట్టినందుకు సంతోషంగా అనిపిస్తుంది. అందరితో స్వేహపూర్వకంగా ఉంటాం. మేము ఇంత మంది కవలలతో చదువుతుండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరైనా పిలిస్తే కన్ఫ్యూస్ అవుతారు. తనకు ఏడుపు వస్తే నాకు కూడా ఆటోమేటిక్‌గా ఏడుపు వస్తుంది. మా ఫ్యామిలీ తప్ప మా స్నేహితులు అసలు ఎవ్వరూ మమ్మల్ని గుర్తు పట్టరు. రోజుకు చాలా సార్లు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం కానీ కలిసి ఉండాలనే అనిపిస్తుంది." - కవల విద్యార్థులు