150 Year Cinema Tree Fallen Down in East Godavari District : అదొక గ్రామం. ఆ గ్రామంలో ఓ చెట్టు. అయితే ఏంటి అని అనుకుంటున్నారా! అసలు విషయం ఇక్కడే ఉందండి. ఆ చెట్టుకు సుమారు 150 ఏళ్ల వయస్సు. అందులో ప్రత్యేకత ఏం ఉంది అని ఆలోచిస్తున్నారా! ఆ చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు కొన్ని వందల సినిమాల్లో నటించింది. చెట్టు నటించడం ఏంటని అనుకుంటున్నారా! అవును 300లకు పైగా సినిమాల్లో కనిపించింది ఈ చెట్టు.
ఆ చెట్టును గురించి తెలుసుకుంటే చాలు, చాలా సినిమా కథలు చెబుతుంది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమాలు అల్లుకుపోయాయి. ఇక్కడ సినిమా తీస్తే కచ్చితంగా హిట్ అవుతుందని ప్రముఖ దర్శకుంతా నమ్మేవారు. అందుకే ఏదో ఒక సందర్బంలో ఘాటింగ్‌లు తీసేవారు. అలా దానికి సినిమా చెట్టు అని పేరు వచ్చింది. ప్రకృతి వైపరీత్యమో, పాలకులు, అధికారులు నిర్లక్ష్యమో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది.
నేలకూలిన సినీ వృక్షం :ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఈ భారీ వృక్షం నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున (ఆగస్టు 5న) పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు.
అవాక్కయ్యో ఆకృతులు - చిట్టి కుండీలో భారీ వృక్షం - అదిరిపోయేలా బోన్సాయ్ వృక్ష ప్రదర్శన
పాడి పంటలు సినిమాతో ప్రత్యేక గుర్తింపు :ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రనాయకుల సినిమాలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశ పాత్రలు ఇక్కడే నిర్మాణం జరుపుకొన్నాయి.