WTC 2025 Final:2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఈ కీలకమైన పోరుకు ప్రతిష్ఠాత్మక లండన్ లార్డ్స్ మైదానం వేదిక కానుంది. ఈ ఫైనల్ ఫైట్ 2025 జూన్ 11 నుంచి 15 దాకా జరగనున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. జూన్ 16ను రిజర్వ్ డే గా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
రిజర్వ్ డే కూడా
'2025 జూన్ 11-15 వ తేదీ వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అవసరం అయితే జూన్ 16 రిజర్వ్ డేగా అందుబాటులో ఉంటుంది' అని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లార్డ్స్ వేదికగా జరగడం ఇదే తొలిసారి. సౌతాంప్టన్ వేదికగా తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ (2021) జరిగింది. అందులో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇక 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ ఓవల్ వేదికగా జరిగింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపొందింది. అయితే ఈ రెండు ఎడిషన్స్‌లో ఫైనల్స్‌కు చేరిన భారత్ ఛాంపియన్‌గా నిలువలేకపోయింది. దీంతో ఈ సారైనా ఫైనల్ చేరి డబ్ల్యూటీసీ గద దక్కించుకోవాలని రోహిత్ సేన ఉత్సాహంగా ఉంది.
పాయింట్ల పట్టికలో టాప్‌లో భారత్
2023 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా కంటే పాయింట్ల పట్టికలో భారత్ ముందంజలో ఉంది. 9 మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి భారత్ 68.51 విన్నింగ్ పర్సంట్‌తో తొలి స్థానంలో నిలిచింది. 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలుపొంది, ఆసీస్ 62.50 విన్నింగ్ పర్సంటేజ్ నమోదు చేసి రెండో స్థానంలో కొనసాగుతోంది. అలాగే న్యూజిలాండ్ ఆరు మ్యాచుల్లో మూడు గెలిచి, మూడు ఓడిపోయింది. 50 శాతం పాయింట్ పర్సెంటేజీతో నిలిచింది. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, ఐదో ప్లేస్ లో ఇంగ్లాండ్ నిలిచింది. చివరి నాలుగు స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు నిలిచాయి.