WTC India Scenario 2025 : టీమ్ఇండియాకు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి. తొలుత వరుసగా ఆరు విజయాలతో ఆగ్రస్థానంలో కొనసాగిన భారత్, గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓటములతో ఇప్పుడు మూడో ప్లేస్‌కు పడిపోయింది. ప్రస్తుతం భారత్ 57.29తో మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (60.71 శాతం) రెండో పొజిషన్లో ఉంది. మరోవైపు శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా (63.33 శాతం) టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. దీంతో టీమ్ఇండియా ఫైనల్ చేరాలంటే తాజా సమీకరణాలు ఇలా ఉన్నాయి.
4- 1, 3-1 ఏదైనా ఓకే
ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమ్‌ఇండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు టెస్టుల్లోనూ నెగ్గాలి. అందులో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకూడదు. అయితే ఒక మ్యాచ్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో అన్ని గెలవాలి లేదా ఒకటి డ్రా చేసుకుని, మిగతా రెండింట్లో నెగ్గాలి. భారత్ 4- 1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్ల శాతంతో, 3-1తో నెగ్గితే 60.52 పాయింట్ల శాతంతో ఆసీస్‌ను దాటి టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది.
2 -2 అయినా ఆశలు సజీవమే!
ఒకవేళ ఈ బోర్డర్- గావస్కర్ సిరీస్ 2- 2తో డ్రా అయినా టీమ్ఇండియాకు అవకాశముంటుంది. కానీ, అలా జరిగితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2- 0తో క్లీన్‌స్వీప్ చేయాలి. లేగా ఆ రెండు మ్యాచ్‌లనూ లంక డ్రాగా ముగించినా ఫర్వాలేదు. అప్పుడు ఆసీస్, భారత్ 55.26 పాయింట్ల శాతంతో సమానంగా ఉంటాయి. అయితే ఎక్కువ సిరీస్‌ల్లో విజయం సాధించిన కారణంగా టీమ్ఇండియాకు ఫైనల్ రూట్ క్లీయర్ అవుతుంది.