MS Dhoni about Rohith Sharma : భారత క్రికెట్ చరిత్రలోనే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది రికార్డుకెక్కాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు, తన మొదటి మూడు మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత నాలుగో వన్డే నుంచి జట్టులో ఓపెనర్‌గా ఆడటం ప్రారంభించాడు. అలా ఓపెనర్‌గా ఆడిన తన మొదటి మ్యాచ్‌లోనే 93 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
అయితే తాజాగా హిట్ మ్యాన్ ఆట తీరును టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ప్రతిభ దేవుడిచ్చిన బహుమతి అని ప్రశంసించాడు.
"రోహిత్ శర్మ అద్భుతంగా ప్రదర్శన చేయగలడు. అతడి ఆటతీరుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అతడికి ప్రతిభ దేవుడిచ్చిన వరం. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం రోహిత్‌కు చాలా అవసరం. జట్టులో గొప్ప స్థాయికి చేరుకోవడానికి ఇలాంటి ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వ్యక్తిగతంగా అతడు ఆడే విధానానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అప్పుడు రోహిత్, మనోజ్ తివారిలు జట్టులో ఓపెనర్లుగా రాణించేవారు. ఇద్దరిలో ఒకరు కచ్చితంగా దూకుడుగా ఆడేవాళ్లు ఉండాలని భావించాం. మనోజ్ అలాంటి ప్రదర్శన చేయడు. కాబట్టి హిట్ మ్యాన్ దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెనర్‌గా మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు" అంటూ ధోనీ హిట్ మ్యాన్‌ను ప్రశంసించాడు. కాగా, హిట్ మ్యాన్ 265 వన్డే మ్యాచ్‌ల్లో 10,866 పరుగులు సాధించాడు.