Virat Kohli Vs Babar Azam :కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడం కంటే కంటే వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారించాలంటూ బాబర్ అజామ్‌కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ హితువు పలికాడు. ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలంటూ బాబర్‌కు సూచించాడు. గత వన్డే ప్రపంచ కప్, పొట్టి కప్‌ల్లో పాక్ ఘోరంగా విమర్శల పాలైంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన అతడ్ని పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పిస్తారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాబర్ అజామ్‌కు యూనిస్ కీలక సూచనలు ఇచ్చాడు.
"బాబర్‌పై మా అందరికీ భారీ అంచనాలే ఉంటాయి. సోషల్ మీడియాలో అభిమానులు చాలా పోస్టులు పెడుతుంటారు. వాటన్నింటికీ ఆటగాళ్లు తమ బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, ప్లేయర్లు చాలా తెలివిగానే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ముందు అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. ఎల్లప్పుడూ తనకు అవకాశాలు వస్తూనే ఉండవు. తక్కువ వయసులోనే బాబర్ ఎంతో సాధించాడు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై అతడు క్లారిటీతో ఉండాలి. కెప్టెన్సీ అనేది చాలా చిన్న విషయం. ఓ ప్లేయర్‌గా నువ్వు ఎంత క్వాలిటీ పెర్ఫామెన్స్ ఇస్తున్నావనేదే ముఖ్యం. విరాట్ కోహ్లీని తీసుకుంటే సారథ్యం నుంచి అతడు వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి భారీగా పరుగులు చేస్తూ రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు. దేశం కోసం ఆడటమే అత్యంత ముఖ్యం. ఆ తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు అది వ్యక్తిగత కీర్తి కోసం ప్రయత్నించేందుకు ఉపయోగించాలి" అని యూనిస్ తెలిపాడు.
అతడికి మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం ఆశ్చర్యమే
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాక్ కెప్టెన్సీలో జరిగిన మార్పులు ఆ దేశ క్రికెట్ పరిస్థితికి అద్దం పట్టేలా ఉందని క్రికెట్ విశ్లేషకుల మాట. ఎప్పటి నుంచో ఉన్న బాబర్‌ను పక్కన పెట్టి అతడి స్థానంలో షహీన్‌ను తీసుకొచ్చింది. కానీ మళ్లీ బాబర్‌నే సారథిగా ఎంపిక చేసి పొట్టి కప్ టోర్నీకి పంపించింది. అయితే అక్కడ బాబర్ పేలవ ఫామ్ జట్టును తీరని నష్టాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో అసలు బాబర్‌ను మళ్లీ కెప్టెన్ చేయడమనే అంశం తమను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఇమాద్ వసీమ్ వ్యాఖ్యానించాడు.