David Warner Virat Kohli : మరో 4 రోజుల్లో ఆసీస్, టీమ్ ఇండియా మధ్య బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతున్న భారత బ్యాటర్ విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియాపై గత సిరీసుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్, ఇప్పుడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసుల్లో విరాట్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆందోళన తప్పదు -కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా ఆస్ట్రేలియాకు ఆందోళన తప్పదని వార్నర్ హెచ్చరించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకోవడానికి ఇరు జట్లకూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అత్యంత కీలకమైన సిరీస్ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే విరాట్ కోహ్లీ ఉత్సాహంగా ఉంటాడని, అతడు విసిరే సవాల్‌తో ఆతిథ్య జట్టుకు టెన్షన్ తప్పదని తెలిపాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించి విమర్శకులు నోళ్లు మూయించేందుకు విరాట్ ప్రయత్నిస్తాడని అభిప్రాయపడ్డాడు.
"గతంలోనూ ఆసీస్ పై విరాట్ కోహ్లీ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అందుకే, ఈసారి కోహ్లీ ఉన్న భారత్‌ను చూస్తే ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున నాకు ఆందోళనగా ఉంది. కోహ్లీని పరుగులు చేయనీయకుండా కట్టడి చేస్తే జట్టు విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి. గత కొన్ని సిరీసుల్లో విరాట్ ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. కానీ, దిగ్గజ క్రికెటర్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. ఒక్కసారి అవకాశం దొరికితే అస్సలు వదిలిపెట్టడు"
-డేవిడ్ వార్నర్, ఆసీస్ బ్యాటర్