Virat Kohli Earnings:ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో టీమ్‌ఇండియా ప్లేయర్లు సచిన్ తెందూల్కర్, ఎంస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యంత ధనవంతులు. ప్రస్తుత సంపాదన విషయానికి వస్తే విరాట్ అందరికంటే ముందుంటాడు. వీళ్లే కాకుండా అనేక మంది అథ్లెట్లు భారీగానే సంపాదిస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా గత 12నెలల్లో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్ల జాబితాలో విరాట్ స్థానం సంపాదించాడు. అంతే కాకుండా ఈ లిస్టులో ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీయే. మరి గడిచిన 12నెలల్లో విరాట్ సంపాదన ఎంత? ఈ లిస్ట్‌లో టాప్‌లో ఎవరు ఉన్నారో తెలుసా?
అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గడిచిన 12 నెలల్లో రూ.847 కోట్లు సంపాదించాడు. మొత్తం క్రీడాకారుల జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానొ రొనాల్డో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు గత 12నెలల్లో రూ.2081 కోట్లు సంపాదించాడు. స్పానిష్ ప్రొఫెషనల్ గోల్ఫర్ జాన్ రాహ్మ్ రెండో స్థానంలో ఉండగా, స్టార్ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మూడో స్థానంలో ఉన్నాడు.
అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ నాలుగు, గ్రీక్-నైజీరియన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు జియానిస్ ఆంటెటోకౌన్‌పో ఐదో స్థానాల్లో ఉన్నారు. చివరి ఐదు స్థానాల్లో వరుసగా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాప్పే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్‌మార్, ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కరీమ్ బెంజెమా, ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు స్టీఫెన్ కర్రీ పదో స్థానంలో ఉన్నారు.