Vinesh Phogat Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో బుధవారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. మహిళల 50 కేజీల కేటగిరీ ఫైనల్స్‌కి దూసుకెళ్లిన రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ని డిస్‌క్వాలిఫై చేశారు. రజత పతకాన్ని ఖాయం చేసుకున్నప్పటికీ, వినేశ్ బంగారు పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. అవసరమైన బరువు పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది.
బరువు మెయింటైన్ చేయడంలో సవాళ్లు
ఈ అంశంపై భారత కంటింజెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పుడివాల్ స్పందించారు. 'రెజ్లర్లు సాధారణంగా వారి ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వారి సహజ శరీర బరువు కంటే తక్కువ బరువు కేటగిరీలలో పోటీపడతారు. బరువు తగ్గించుకునేందుకు ఆహారం, నీళ్లు విషయంలో కఠిన నియమాలు పాటించాలి. ఆవిరి స్నానాలు, వ్యాయామాల ద్వారా అదనపు బరువు తగ్గించుకుంటారు' అని పేర్కొన్నారు.
ఇలా బరువు తగ్గడం వల్ల రెజ్లర్ తేలికైన విభాగంలో పోటీపడగలరు. అయితే దీని వల్ల కాస్త బలహీనంగా మారి, శక్తిని కోల్పోతారు. పోటీకి ముందు బరువును కొలిచిన తర్వాత అథ్లెట్లు సాధారణంగా నీరు, నిర్దిష్ట ఆహారాలతో శక్తిని పొందుతారు. వినేశ్ మ్యాచ్ కోసం రోజంతా ఎనర్జీ కాపాడుకోవడానికి ఆమెకు 1.5 కిలోగ్రాముల ఆహారం అవసరమని పోషకాహార నిపుణులు అంచనా వేశారు.
రీబౌండ్ ఎఫెక్ట్:పోటీ తర్వాత తరచుగా రీబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. వినేశ్ మూడు మ్యాచ్‌ల తర్వాత డీహైడ్రేషన్‌ను నివారించడానికి కొంచెం నీరు అవసరం. ఆమె రెగ్యులర్ వెయిట్ కట్ రొటీన్‌ను ఫాలో అయినప్పటికీ, మరుసటి రోజు ఉదయం 50 కిలోల పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో డిస్‌క్వాలిఫై కావాల్సి వచ్చింది. డాక్టర్ పుడివాల్ మాట్లాడారు 'పోషకాహార నిపుణులు రెగ్యులర్ రొటీన్‌పై నమ్మకంగా ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి ఆమె జుట్టును కత్తిరించడం సహా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, 50 కిలోల మార్కును చేరుకోలేకపోయాం' అని వివరించారు.