Vinesh Phogat Haryana Government :అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచే అవకాశం కోల్పోయిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను హరియాణా ప్రభుత్వం విజేతగానే పరిగణించి స్వాగత, సత్కారాలు చేయనుంది. ఈ మేరకు హరియాణా సీఎం నయాబ్‌సింగ్ షైనీ ఓ ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన వారికి ఇచ్చే రివార్డ్‌ను ఆమెకు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. హరియాణా రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.6కోట్ల నగదు, రజతం అయితే రూ.4కోట్ల రివార్డ్, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ఇస్తారు. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం కూడా వినేశ్ ఫొగాట్‌ను రజత పతక విజేతగా పరిగణించి, ఆమెకు రూ.4కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనుంది.
'వినేశ్ - నీ నిర్ణయం మార్చుకో'
ఇక వినేశ్ రిటైర్మెంట్పై రియాక్ట్ అయిన ఆమె ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ తన ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని కోరారు. అవసరమైతే తాను ఆమెతో కూర్చొని మాట్లాడతానంటూ మహవీర్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అనర్హత వేటు పడిన వెంటనే వినేశ్‌కు మద్దతు తెలిపిన ఆయన వచ్చే ఒలింపిక్స్‌కు తనను సిద్ధం చేస్తానంటూ హామీ కూడా ఇచ్చారు.