Under 19 World Cup Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్, రికార్డుల రారాజు రోహిత్‌శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్ తన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. అండర్-19 క్రికెట్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన రోహిత్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఇలా అండర్-19 నుంచి క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ప్లేయర్లు పోలిస్తే రోహిత్ శర్మ ప్రత్యేకతను చాటుకున్నాడు.
అయితే రోహిత్‌తో పాటు అండర్-19 నుంచి క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ప్లేయర్లు ఎవరూ ఇప్పుడు ఆడటం లేదు. అందరూ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఒక్కరే ఫామ్‌లో ఉన్నారు. ఒకప్పుడు ఆయా దేశాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్లేయర్లు ఎప్పుడో మైదానం వీడగా, రోహిత్ శర్మ మాత్రం నిలకడైన ఆట తీరుతో ఇంకా కొనసాగడటం విశేషంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా రోహిత్‌తో పాటు అండర్-19 క్రికెట్ ఆడి, రిటైర్మెంట్ తీసుకున్న క్రీడాకారులు ఎవరెవరో ఓసారి చూద్దాం.
ఇమాద్ వసీమ్ :రోహిత్ శర్మతో పాటు అండర్-19లో గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్ బ్యాటర్ ఇమాద్ వసీం. గత ఏడాదే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 నవంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికినట్లు తెలిపాడు. 55 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇమాద్ వసీమ్ అండర్-19 టోర్నీలో మెరుపులు మెరిపించాడు. కేవలం 34 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పడం ఇమాద్ వసీం అభిమానులను నిరాశపరిచింది.
తిసారా పెరీరా :శ్రీలంక మాజీ క్రికెటర్ తిసారా పెరీరా కూడా రోహిత్ సహచరుడే. ఇద్దరూ ఒకేసారి అండర్-19లో తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో రిటైర్మెంట్ తీసుకున్న పెరీరా, శ్రీలంక తరపున ఆడిన మ్యాచ్‌ల్లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. పరిమిత ఓవర్ల ఫార్మట్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలానే 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న శ్రీలంక జట్టులో సభ్యుడు.
సునీల్ నరైన్ :వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సునీల్ నరైన్ కూడా గత ఏడాదే రిటైర్మెంట్ పలికాడు. 2011లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన సునీల్ నరైన్ కేవలం 12 ఏళ్లు మాత్రమే ఆటను కొనసాగించాడు. ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు నరేన్.
మొయిన్ అలీ :ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ కూడా రోహిత్ శర్మతో పాటే అండర్-19 ఆడాడు. గత ఏడాది టెస్ట్ మ్యాచ్‌లకు వీడ్కోలు చెప్పాడు మొయిన్ అలీ. 2014లో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి ప్రవేశించిన మొయిన్ అలీ 2023లో రిటైర్మెంట్ తీసుకున్నాడు.