Mumbai Fans Sorry To Hardik Pandya :జులై 4న బార్బడోస్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా, ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ప్రధానితో సమావేశం పూర్తయ్యాక ఓపెన్ బస్ పరేడ్ కోసం ముంబయికి చేరుకుంది. ఈ సందర్భంగా ముంబయి విమానాశ్రయం దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడి జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముంబయి ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యకు సారీ చెప్పారు. ఐపీఎల్ 2024 సీజన్ సమయంలో హార్దిక్‌ను దుర్భాషలాడినందుకు క్షమాపణలు చెప్పారు.
ఐపీఎల్ 2024కు ముందు ముంబయి కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా అందుకు తగ్గట్టే హార్దిక్ సీజన్లో పేలవ ప్రదర్శన చేశాడు. చివరికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి టీమ్‌గా ముంబయి నిలిచింది. పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది. దీంతో పాండ్యాపై ముంబయి, రోహిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మరింత పెరిగింది. కానీ ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో మాత్రం హార్దిక్ మంచి ప్రదర్శన చేశాడు. ట్రోఫీని గెలవడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. దీంతో అతడిపై మళ్లీ ప్రశంసల వర్షం కురిసింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ముంబయి ఫ్యాన్స్ హార్దిక్‌కు సారీ చెప్పారు. ఓ అభిమాని "మొదటగా, హార్దిక్ పాండ్యాకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అతన్ని ఎందుకు ట్రోల్ చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. చాలా కృతజ్ఞతలు. ఫైనల్ ఓవర్ అద్భుతంగా బౌల్ చేశారు. నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మీ గురించి నేను ఎందుకు తప్పుగా మాట్లాడానో, నాకు తెలియదు" అని చెప్పారు.