Virat Kohli Retirement:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత తన ప్లాన్స్ గురించి వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం ఎవరికీ కనిపించనని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న విరాట్ రీసెంట్గా ఆర్సీబీ రాయల్ గలా డిన్నర్ ప్రోగ్రామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఓ క్రీడాకారుడిగా మాకు కెరీర్ ముగించాల్సిన రోజు ఒకటి ఉంటుంది. నేను కూడ ఎప్పటికీ ఇలాగే ఆడలేను. నాకు ఇప్పటికైతే కెరీర్ పరంగా ఎలాంటి రిగ్రెట్స్ లేవు. 'ఫలానా రోజు ఇలా చేసి ఉంటే బాగుండేది' అనుకుంటూ కెరీర్‌ను ముగించడం నాకు ఇష్టం లేదు. చేయలేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్తా. ఇక ఏదో ఒకరోజు నేను కూడా ఆటకు ముగింపు పలుకుతా. ఆ తర్వాత కొంతకాలం మీకు ఎవరికీ నేను కనిపించను. అందుకే ఆడినన్ని రోజులు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది' అని విరాట్ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నారు.
ఇక 35ఏళ్ల విరాట్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరం కాలేదు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విరాట్ భారత్‌కు అనేక విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్లలో విరాట్ తనదైన మార్క్ చూపుతూ కోట్లాది ఫ్యాన్స్‌ను సంపాదించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లతోపాటు అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.