Rinku Singh T20 World cup:2024 టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ గురువారం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో పలువురి ఎంపికపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అగార్కర్ రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యంగ్ ప్లేయర్ రింకూ సింగ్‌ను పక్కన పెట్టడంపై స్పందించాడు.
వాళ్ల కోసం తప్పలేదు:ఇక 15మంది జట్టులో యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ లేకపోవడంపై కూడా అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. 'రింకూ జట్టులో ఎంపిక చేయకపోవడం కఠినమైన నిర్ణయమే. కానీ తప్పదు. అతడు ఎలాంటి తప్పిదాలు చేయలేదు. మేం టీమ్ కాంబినేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. జట్టులో ఇద్దరి కంటే ఎక్కువ స్పిన్నర్లు కావాలని అనుకున్నాం. అందుకే రింకూ రిజర్వ్ బెంచ్‌లో ఉండాల్సి వచ్చింది. 15 కంటే ఎక్కువ మందిని ఎంపిక చేయలేం కదా? ఇక గిల్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది' అని అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.
ఆ కారణం వల్లే రాహుల్ దూరం!:
మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతోనే రాహుల్‌ను దూరం పెట్టినట్లు అగార్కర్ చెప్పాడు. 'రాహుల్ ఐపీఎల్లో ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మేం మిడిలార్డర్లో ఆప్షన్స్ కోసం చూశాం. దానికి సంజు శాంసన్, రిషభ్ పంత్ సూట్ అవుతారని భావించాం. శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అక్కడ మాకు కావాల్సిన దాని గురించి ఆలోచించామే తప్పా, ఎవరు బెటర్ అని కాదు' అని అగార్కర్ అన్నాడు.