Team India Meet PM Modi : 2023 నవంబర్ 19న టీమ్ఇండియాకు ఊహించని ఫలితం ఎదురైంది. అజేయంగా ఫైనల్ చేరిన రోహిత్ సేన, ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరిపోరులో ఓటమిచవి చూసింది. కప్పు గెలుస్తుందని ఎదురు చూస్తున్న కోట్ల మంది భారతీయులకు నిరాశ తప్పలేదు. ఆటగాళ్లు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ సమయంలో ప్లేయర్స్‌ను ఓదార్చడానికి, ఇండియా మీ వెంటే ఉందని చెప్పడానికి మోదీ వెళ్లారు.
ఆ కష్ట సమయంలో మోదీ ప్లేయర్లకు అండగా నిలిచారు. ప్రతి ప్లేయర్ వద్దకు వెళ్లి పేరుపేరున పలకరించి ఓదార్చారు. దగ్గరకు తీసుకుని వాళ్ల కన్నీళ్లు తుడిచారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలని కోరారు.
సరిగ్గా 8 నెలల తర్వాత మన ప్లేయర్లను మోదీని కలిశారు. ఈ సారి టీ20 ప్రపంచ కప్ విజేతలుగా ఆయన ముందు నిలిచారు. దీంతో అప్పుడు కౌగిలించుకుని ఓదార్చిన ఆయనే, ఇప్పుడు భుజం తట్టి అభినందించారు. ప్రతి ప్లేయర్‌ను ప్రత్యేకంగా పలకరించి వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సరదాగా ముచ్చటించి టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌తో కలిసి ట్రోఫీని పట్టుకుని మొత్తం ఆటగాళ్లు, టీమ్ స్టాఫ్‌తో కలిసి ప్రధాని ఫోటో దిగారు.
ఈ విజయం వారికి ప్రత్యేకం
భిన్నమైన పరిస్థితుల్లో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్‌లో అడుగు పెట్టింది. 2013 నుంచి మన ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదు. గతేడాది రెండు ఐసీసీ ఫైనల్స్‌లోనూ ఓడింది.