Indian Cricketers Phobia :మనుషుల్లోకొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. అందులో కొన్ని చూసేవారికి చిత్రంగానూ అనిపిస్తుంటాయి. అయితే తమ ఆటతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మన క్రికెటర్లుకూ ఫోబియాలు ఉన్నాయట. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం పలు విషయాలకు భయపడతారట. మరి మనోళ్లలో ఎవరెవరికి ఫోబియా ఉంది? వాళ్ల భయాలు ఏంటో మనం కూడా తెలుసుకుందామా!
కెప్టెన్‌కు అదంటే చిన్నప్పట్నుంచే భయం
కెప్టెన్ రోహిత్ శర్మకు చిన్నప్పట్నుంచీ నీళ్లలో మునగడమంటే భయం అంట. ఆ సమయంలో ఊపిరి బిగపట్టడమంటే ప్రాణం పోయినట్టుగానే అనిపిస్తోందని రోహిత్ చెప్పాడు. నీళ్లలోకి కొట్టుకుపోతానేమో అని భయం ఉంటుందని తెలిపాడు. ఆ ఫోబియా ఎందుకు వచ్చిందో తెలియదని, దానిని అధిగమించడానికి ఈత కూడా నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఈత కొలనులో మునగడం ప్రాక్టీస్ చేసినా, నదులూ, సముద్రాల వద్ద మాత్రం ఈ సాహసం ఎప్పటికీ చేయలేనని అన్నాడు. కానీ సముద్ర తీరాల్లో గడపడం, ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుకోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు.
కోహ్లీకి అదంటే భయం
విమానం కదిలేటప్పుడు తనకు భయమేస్తుందని భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. విమానం ఎక్కిన తర్వాత టేక్‌ఆఫ్ అయ్యేటప్పుడో, దిగేప్పుడో ఒకరకమైన భయం ఉంటుందని తెలిపాడు. అలానే కొన్నిసార్లు టర్బులెన్స్ వల్ల విమానం అటూ ఇటూ ఊగిన సమయంలో తనకు చచ్చేంత భయమేస్తుందని పేర్కొన్నాడు. ఆ టైంలో సీటును చేతులతో గట్టిగా పట్టుకుంటానని అన్నాడు. కానీ, తన పక్కన కూర్చున్న వాళ్లంతా ఏమాత్రం భయపడకుండా ఎవరి పనుల్లో వాళ్లుంటారని, వాళ్లను చూస్తే అంత ధీమాగా ఎలా ఉంటారా అనిపిస్తుంటుందని అన్నాడు. కొన్నేళ్లుగా విమానంలో తిరుగుతున్నప్పటికీ ఆ ఫోబియా నుంచి బయట పడలేకపోతున్ననని తెలిపాడు. అంతేకాదు, విమానం ఎక్కినట్టు కల వచ్చినా కూడా నాకు ఆందోళనగానే ఉంటుందని అన్నాడు.
పాండ్యకూ ఓ ఫోబియా
హార్దిక్ పాండ్యాకు లిఫ్ట్‌లో వెళ్లాలంటే బాగా భయమంటా. ఒకవేళ లిఫ్ట్‌లో వెళ్లాలంటే ఎవరోకరు తోడుండాల్సిందే అని అంటున్నాడు. లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు సడెన్‌గా ఆగిపోతే లోపల ఇరుక్కుపోవాల్సి వస్తుందని అందుకే ఒంటరిగా వెళ్లడానికి సాహసం చేయనని చెప్పాడు. ఎవరూ లేకపోతే మెట్లు ఎక్కుతాడంట. ఇక ఇంజక్షన్ అంటే కూడా హర్దిక్ పాండ్యకు భయమంటా. ప్రాక్టీస్ వల్ల గాయాలై, సర్జరీలు చేయించుకోవాల్సిన సమయంలో చాలా కష్టంగా ఉంటుందని, సూదిని చూసినా కంగారొస్తుందని అన్నాడు.