Virat Strike Rate IPL:2024 ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్ చర్చనీయాంశమైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నా, స్ట్రైక్ రేట్‌పై ఆందోళనలు తలెత్తాయి. ఓ దశలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కి కోహ్లిని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు బీసీసీఐ ఇటీవల టీమ్ ఇండియా స్క్వాడ్‌ని అనౌన్స్ చేసి చర్చలకు ముగింపు పలికింది. గురువారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు.
వరల్డ్ కప్‌లో విరాట్ అనుభవం అవసరం: జూన్ 1న ప్రారంభం కానున్న మెగా టోర్నమెంట్‌లో టీమ్‌ఇండియాకు కోహ్లీ అనుభవం అవసరమని, కోహ్లీ స్ట్రైక్ రేట్ ఎప్పటికీ సమస్య కాదని అజిత్ అగార్కర్ చెప్పాడు. 'ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సెలక్షన్ కమిటీ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి చర్చించలేదు. జట్టులో సరైన బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. 35 ఏళ్ల విరాట్ మిడిల్‌లో ఆ బ్యాలెన్స్‌ని తీసుకొస్తాడని నమ్ముతున్నాం. ఐపీఎల్ నుంచి పాజిటివ్ అంశాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచకప్‌లో ఒత్తిడి వేరుగా ఉంటుంది' అని అన్నాడు.
విరాట్ స్ట్రైక్ రేట్ గురించి నో టెన్షన్?కెప్టెన్ రోహిత్‌కు కూడా విరాట్ స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రెస్మీట్లో విరాట్ స్ట్రైక్ రేట్ గురించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఓ నవ్వు నవ్వుతూ సింపుల్‌గా రియాక్ట్ అయ్యాడు. 'విరాట్ స్ట్రైక్ రేట్ గురించి టెన్షన్ అవసరం లేదు' అన్నట్లు రోహిత్ ఓ లుక్ ఇచ్చాడు.