T20 World cup 2024 Teamindia Squad :ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు 15 మంది ప్లేయర్‌లతో స్క్వాడ్‌ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమవుతోంది. మే 1లోగా టీమ్‌ను అనౌన్స్ చేయాలని ఐసీసీ విధించిన గడువు సమీపిస్తోంది. BCCI ఈ వారం చివరిలో లేదా వచ్చే వారం ప్రారంభంలో ఎప్పుడైనా స్క్వాడ్‌ను ప్రకటించవచ్చు. త్వరలో కెప్టెన్ రోహిత్ శర్మ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సమావేశమై చర్చించే అవకాశం ఉంది.
అయితే ఐపీఎల్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో టీ20 టీమ్ సెలక్షన్‌గా గట్టి పోటీ ఇస్తున్నారు. ఒక ప్లేస్ కోసం ఇద్దరి కన్నా ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కెప్టెన్, సెలక్షన్ కమిటీ ఎవరిని ఎంపిక చేసుకుంటుంది, ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తుందనే దానిపై భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
- రాహుల్ vs సంజూ శాంసన్
టీ20 జట్టులో మొదటి కీపింగ్- బ్యాటర్ ఆప్షన్‌గా పంత్ చోటు దక్కించుకోవచ్చు. పంత్ 161 స్ట్రైక్ రేట్‌తో 342 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కీపింగ్, బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. అయితే సెకండ్‌కీపర్ స్లాట్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది. రాహుల్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లలో 141 స్ట్రైక్ రేటుతో 302 పరుగులు చేశాడు. మరోవైపు శాంసన్ 8 గేమ్‌లలో 152 స్ట్రైక్ రేటుతో 314 రన్స్ కొట్టాడు. అయితే మిడల్ ఆర్డర్ ఎక్స్‌పీరియన్స్, రేంజ్ ఆఫ్ షాట్స్ కారణంగా సంజూ కంటే రాహుల్‌కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. - పాండ్యా వర్సెస్ శివమ్ దూబె
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఫామ్ సెలెక్షన్ ప్యానెల్‌కు ఆందోళన కలిగిస్తోంది. పాండ్యా ఎంఐ తరఫున 8 మ్యాచ్‌లలో 17 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫినిషర్ రోల్‌లో వచ్చి 7 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఇప్పటివరకు లీగ్‌లో 142 స్ట్రైక్-రేట్‌తో చేసిన 150 పరుగులు ఆకట్టుకోలేదు. అయితే టీ20 అవకాశం కోసం ఎదురుచూస్తున్న శివమ్ దూబే, చెన్నై తరఫున బౌలింగ్ చేయలేదు. దీంతో సెలక్టర్లు పాండ్యాకు ఓటు వేయవచ్చు. స్కిల్, పేస్ పరంగా దూబే పాండ్యాకు పోటీ రాలేడు. అయితే దూబే ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ (8 మ్యాచ్‌లలో 22 సిక్సర్లు)ను విస్మరించలేం. - బిష్ణోయ్ వర్సెస్ అవేష్ వర్సెస్ అక్షర్
ఐదుగురు బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బుమ్రా, కుల్దీప్ మినహా ఇతర బౌలర్లు గొప్ప ఫామ్‌లో లేరు. అందువల్ల అదనపు బౌలర్ ఎంపిక అవసరం. రాజస్థాన్ రాయల్స్ పేసర్ అవేశ్, దిల్లీ క్యాపిటల్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.