తెలంగాణ

telangana

ETV Bharat / sports

17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్​ - T20 WORLD CUP 2024 FINAL - T20 WORLD CUP 2024 FINAL

T20 Worldcup 2024 Final TeamIndia Won Title : నరాలు తెగే ఉత్కంఠతో సాగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. 7 పరుగులు తేడాతో గెలుపొందింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ కప్​ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది.

source The Associated Press
T20 Worldcup 2024 Final TeamIndia won match (source The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 11:35 PM IST

Updated : Jun 29, 2024, 11:40 PM IST

T20 Worldcup 2024 Final TeamIndia Won Title :టీ20 ప్రపంచకప్‌ 2024 మనదే. 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ కప్​ను రెండో సారి సగర్వంగా ముద్దాడింది భారత్ జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన నరాలు తెగే ఉత్కంఠ ఫైనల్‌ మ్యాచ్​లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది. కాగా, ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఇక ఈ మ్యాచ్​ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, చివరి ఓవర్‌లో విజయం అందించిన హార్డిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలానే బ్యాట్‌తో విజయంలో కీలకంగా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు) చెలరేగాడు. క్వింటన్‌ డికాక్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 39 పరుగులు), స్టబ్స్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 31 పరుగులు) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 3, బుమ్రా 2, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు.

మ్యాచ్ సాగిందిలా - ఈ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు కూడా మొదట శభారంభం దక్కలేదు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్‌ (39), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (31) జట్టును కాస్త ఆదుకున్నారు. దీంతో ప్రత్యర్థి జట్టు లక్ష్యం దిశగా ముందుకెళ్లింది. కానీ ఆ తర్వాత స్కోరు 8.5 ఓవర్లలో 70/3గా ఉన్నప్పుడు స్టబ్స్‌ ఔట్‌ అయ్యాడు. అప్పుడు మళ్లీ భారత్‌ పోటీలోకి వచ్చినట్టు కనిపించింది. కానీ ఆ వెంటనే అప్పుడే క్రీజులోకి వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ వేసిన 15 ఓవర్లో అయితే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది 24 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లోనే ఫాస్టెస్ట్​ హాఫ్‌ సెంచరీ కూడా అందుకున్నాడు.

దీంతో సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. 16 ఓవర్​లో బుమ్రా 4 పరుగులు ఇచ్చాడు. ఇక 17 ఓవర్‌ ఫస్ట్ బాల్​కు హెన్రిచ్‌ క్లాసెన్‌ను ఔట్‌ చేసి భారత జట్టుకు బిగ్‌ రిలీఫ్‌ అందించాడు హార్దిక్ పాండ్య. అనంతరం 18వ ఓవర్​లో బుమ్రా 2 పరుగులు ఇచ్చి మార్కో జాన్సెన్‌ వికెట్ తీశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 2 ఓవర్లలో 20 పరుగులుగా మారిపోయింది. ఇక చివరి రెండు ఓవర్లలోనూ మనోళ్లు అద్భుతం చేశారు. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా సూర్యకుమార్ దూకుడు మీదున్న మిల్లర్ బంతిని క్యాచ్ పట్టుకుని భారత్ వైపు మ్యాచ్​ను తిప్పాడు. తర్వాత హార్దిక్​ కూడా లాస్ట్ ఓవర్​లో మరో వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించారు.

టీమ్​ఇండియా ఇన్నింగ్స్ - అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (76; 59 బంతుల్లో 6×4, 2×6) అదరగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) దూకుడుగా ఆడాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక్క బంతి వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌ (0) పరుగులేమీ చేయకుండానే డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి జట్టు స్కోరు కేవలం 23 పరుగులు మాత్రమే.

అనంతరం స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ (3) రబాడా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్లాసెన్‌ చేతికే చిక్కిపోయాడు. దీంతో ఐదు ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల భారత క్రికెట్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌(47)తో కలిసి విరాట్ కోహ్లీ(76) చక్కటి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు. దీంతో టీమ్‌ ఇండియాకు కాస్త స్వాంతన దక్కింది. అయితే, హాఫ్ సెంచరీకి చేరువలో సమన్వయ లోపంతో అక్షర్‌ పటేల్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. చివర్లో శివమ్‌ దూబె (27; 16 బంతుల్లో 3×4,1×6) మెరుపులు మెరిపించాడు. దీంతో టీమ్‌ ఇండియా మంచి స్కోరు చేసింది. జడేజా (2), హార్దిక్‌ పాండ్య (5*) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.

దంచికొట్టిన విరాట్, అక్షర్- సౌతాఫ్రికా టార్గెట్​ 177 - T20 World Cup 2024

ఫైనల్ మ్యాచ్​కు సుధీర్- స్టేడియం వద్ద ఫుల్ రష్- టీమ్ఇండియా ఫ్యాన్స్​ తగ్గేదేలే! - T20 World Cup 2024

Last Updated : Jun 29, 2024, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details