T20 Worldcup 2024 Bangladesh VS Afghanisthan :టీ20 ప్రపంచ కప్2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. అద్భుత విజయంతో తొలిసారి సెమీ ఫైనన్లో అడుగుపెట్టిందా జట్టు. మంగళవారం (జూన్ 25) చివరి బంతి వరకూ హోరీహోరీగా సాగిన సూపర్ 8 మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో నేరుగా గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరుకుంది అఫ్గాన్. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి టీమ్ఇండియా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఆఫ్గాన్ విజయంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్కు అర్హత సాధించాయి. దీంతో తొలి సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరగనుంది.
మ్యాచ్ సాగిందిలా - తాజాాగా జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకే పరిమితమైంది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే షాక్ తగిలింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది. పేసర్లు ఫజల్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ విజృంభించడం వల్ల 23 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్, లిటన్ దాస్ జట్టును కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సౌమ్య సర్కార్ పెవిలియన్ చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు లిటన్ దాస్ (54) క్రీజ్లో పాతుకుపోయి ఆడాడు. అర్ధ శతకం బాది చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఆఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, నవీనుల్ హక్ కూడా చెరో 4 వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు.