T20 world cup 2024 : ఐసీసీ ఒక కీలక ప్రకటన చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నాకౌట్ దశను టీమ్ ఇండియా విజయవంతంగా పూర్తి చేస్తే జూన్ 27న సెకండ్ సెమీ ఫైనల్‌ను గయానాలో ఆడనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో సమీ ఫైనల్‌కు రిజర్వ్ డేను తొలిగించింది. ఈ మ్యాచ్‌ను అదే రోజు ముగించేందుకు అదనంగా 4 గంటల సమయాన్ని (250 నిమిషాలు) కేటాయించాయి. ఒకవేళ రెండో సెమీస్ రిజర్వ్ డేకు వెళ్తే గెలిచిన జట్టు తర్వాతి రోజునే ఫైనల్ ఆడాల్సిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తొలి సెమీస్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంటుందని స్పష్టం చేసింది.
ట్రినిడాడ్ వేదికగా జూన్ 26న తొలి సెమీస్ జరగనుంది. అక్కడి స్థానిక సమయం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం తర్వాతి రోజు ఉదయం 6 గంటలు. ఒకవేళ వర్షం కారణంగా ఆ రోజు ఆట రద్దైతే తర్వాతి రోజు జూన్ 27న రిజర్వ్ డేన ఆటను కొనసాగిస్తారు. కానీ, రెండో సెమీఫైనల్ జరిగే గయానాలో సమయం వేరేలా ఉంటుంది. జూన్ 27న స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అంటే భారత సమయం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.
అంటే రెండు సెమీ ఫైనల్స్‌లోని విజేతలు జూన్ 28న బార్బడోస్ (ఫైనల్ మ్యాచ్ వేదిక) ప్రయాణించాల్సిన నేపథ్యంలో సెకండ్ సెమీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా అదే రోజున(27వ తేదీ) ముగించాలని ఐసీసీ నిర్ణయించుకుంది. అందుకే నాలుగు గంటల అదనపు సమయాన్ని కేటాయించింది. దీంతో 27 ఆట ముగియగానే జూన్ 28న ప్రయాణించి 29న బార్బడోస్‌లో తుది పోరు ఆడతారు.