Swapnil Kusale Paris Olympics:పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. తాజా మెడల్తో ప్రస్తుత ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది.
ఆట మొదట్లో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ, తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో టాప్ -2లోకి దూసుకెళ్లాడు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవడం వల్ల స్వప్నిల్ మూడో స్థానంలో దక్కించుకున్నాడు. స్వప్నిల్ కంటే ముందు 463.6 పాయింట్లతో లీ యుకున్ (చైనా) స్వర్ణ పతకం దక్కించుకోగా, 461.3 పాయింట్లతో కులిశ్ (ఉక్రెయిన్) రజతం సొంతం చేసుకున్నాడు.
కాగా, 50మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత్ పతకం నెగ్గడం ఇదే తొలిసారి. ఇక, ప్రస్తుత ఒలింపిక్స్లో ఇప్పటివరకు భారత్ సాధించిన మూడు పతకాలు కూడా షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. స్వప్నిల్ కంటే ముందు మనూ బాకర్ (10మీటర్లు ఎయిర్ రైఫిల్ సింగిల్స్), మనూ బాకర్- సరబ్జోత్ సింగ్ (10మీటర్ల రైఫిల్ మిక్స్డ్) ఈవెంట్లలో మన అథ్లెట్లు పతకాలు నెగ్గారు.