Swapnil Kusale Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్యం సాధించడంపై అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దేశం కోసం స్వప్నిల్ పతకం గెలుస్తాడనే నమ్మకం తమకు ముందు నుంచి ఉందని తెలిపారు. ఆటపై స్వప్నిల్ దృష్టిని మరల్చకుండా ఉంచేందుకు అతడికి బుధవారం ఫోన్ కూడా చేయలేదని స్వప్నిల్ తండ్రి చెప్పారు.
'గత 10- 12 ఏళ్లుగా స్వప్నిల్ ఎక్కువగా ఇంటికి దూరంగా ఉన్నాడు. లక్ష్యసాధనపై దృష్టి పెట్టాడు. మాకు అభినందించడానికి శ్రేయాభిలాషులు కాల్స్ చేస్తున్నారు. స్వప్నిల్‌కు ఆటపై దృష్టి మళ్లకూడదని మ్యాచ్ ముందు రోజు( బుధవారం) కాల్ కూడా చేయలేదు' అని స్వప్నిల్ తండ్రి తెలిపారు. స్వప్నిల్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడని, సాంగ్లీలో ఉన్నప్పుడు షూటింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడని అతడి తల్లి వెల్లడించారు. తర్వాత షూటింగ్ శిక్షణ కోసం నాసిక్‌కు వెళ్లాడని చెప్పుకొచ్చారు. కాగా, స్వప్నిల్ స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హపుర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న స్వప్నిల్ కుసాలేపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ తదితరులు స్వప్నిల్‌ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాంక్షించారు.
'భవిష్యత్తులో మరిన్ని గెలవాలి'
'పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న స్వప్నిల్ కుసాలే కు హృదయపూర్వక అభినందనలు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ నిలిచాడు. ఒకే ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లలో భారత్ మూడు పతకాలు సాధించడం ఇదే తొలిసారి. రాబోయే ఈవెంట్‌లలో ఆడబోయే భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. స్వప్నిల్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని కోరుకుంటున్నాను' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు.