Sri Lanka Highest Score In Test :బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక 48 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో విశేషమేంటంటే లంక తరపున ఏ బ్యాటర్ కూడా సెంచరీ మార్క్‌ను అందుకోలేదు. ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండా శ్రీలంక 531 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఎవరూ శతకం సాధించకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా లంక చరిత్ర సృష్టించింది. టాప్ ఏడుగురు బ్యాటర్లు అర్ధ శతకాలతో మెరిశారు. కుశాల్ మెండిస్ 93 పరుగులతో అత్యధిక స్కోరు చేయగా కమిందు మెండిస్ 92 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు భారత్ పేరిట ఉండేది. 1976లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు ఒక్కరూ కూడా సెంచరీ చేయకపోయినా భారత్ 524/9 స్కోరు చేసి ఈ రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును లంక బద్దలు కొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 314/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక దినేశ్ చండిమాల్ (59), ధనంజయ డిసిల్వా (70;), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించడంతో 531 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రీలంక 531 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. నైట్ వాచ్‌మెన్ తైజుల్ ఇస్లాం పరుగులేమీ లేకుండా బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.