South Africa vs India 1st T20I :సౌతాఫ్రికా పర్యటనలోటీమ్‌ఇండియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా శనివారం జరిగిన తొలి టీ20లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (25 పరుగులు) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3, ఆవేశ్ ఖాన్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
సంజూ మెరుపులు
ఓపెనర్ సంజు శాంసన్ (107; 50 బంతుల్లో 7×4, 10×6) మెరుపు శతకం సాధించాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడు. మరో ఓపెనర్ అభిశేక్ శర్మ (7) విఫలమైనా, సంజూ మాత్రం దూకుడుగా ఆడాడు. శాంసన్‌తో పాటు తిలక్ వర్మ (33; 18 బంతుల్లో 3×4) ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన సంజూ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే?
- టీ20ల్లో భారత్ తరఫున రెండు సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గా శాంసన్ ఘనత సాధించాడు.
- టీ20లో భారత్ తరఫున వరుసగా రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. ఇటీవల హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన మూడో టీ20లో శాంసన్ శతకం చేశాడు.
- ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా సంజు నిలిచాడు. అంతకుముందు గుస్తావ్ మెకియాన్, రిలీ రోసోవ్ (సౌతాఫ్రికా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) ఉన్నారు.
- సౌతాఫ్రికాపై టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం (47 బంతుల్లో) నెలకొల్పిన ఆటగాడిగా సైతం శాంసన్ రికార్డు సృష్టించాడు.
- టీ20ల్లో సౌతాఫ్రికాపై భారత్‌కు అత్యధిక స్కోరు (202).