Shubman Gill Impact Player Rule :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఈ పోరులో చేధనలో విఫలమై కేవలం 4 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది గుజరాత్. దీంతో పాయింట్ల పట్టికలో ఒక స్థానం కిందకు పడిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఇలా స్పందించారు.
"జట్టుకు అధిక స్కోరును చేర్చడంలో ఇంపాక్ట్ ప్లేయర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. వికెట్లు పడిపోతున్నా అతడు ఉన్నాడనే నమ్మకం మిగిలిన వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని చివరి వరకూ పోరాడేలా చేస్తుంది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో మేము 200 - 210 పరుగుల మధ్యనే కట్టడి చేస్తామని అనుకున్నాం. చివరి 2 ఓవర్లలో కొన్ని అదనపు పరుగులు కూడా చేశాం. ఛేజింగ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లక్ష్యం మనం చేధించగలమా? లేదా? అని ముందుగా తెలుసుకోవాలి. దానిని అమలుపరచడం కూడా అంతేముఖ్యం. బౌలర్లకు గ్రౌండ్ అనుకూలించకపోతే యార్కర్లు వేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. మేం బాగానే ఆడామని అనుకుంటున్నాం. చివరిలో అసంతృప్తికి గురి కావాల్సి వచ్చింది. గేమ్ ఆసాంతం గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాం" అని గిల్ వెల్లడించాడు.
ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. పంత్ 43 బంతుల్లో 88 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. మరో దిల్లీ ప్లేయర్ అక్సర్ పటేల్ కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 43 బంతుల్లో 66 పరుగులు సాధించారు. ఆరంభంలో పటిష్ఠంగా కనిపించిన గుజరాత్ బౌలర్లు క్రమంగా పట్టు కోల్పోవడం వల్ల రిషబ్ - అక్షర్ ల జోడీ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది.