Shubman Gill Election Campaign: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను పంజాబ్ 'స్టేట్ ఐకాన్' నియమించింది ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గిల్‌ను 'స్టేట్ ఐకాన్'గా నియమిస్తున్నాట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ సీ తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజీ 70శాతానికి పెంచడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు.
'శుభ్‌మన్ గిల్‌ను ఈ రాష్ట్రంలో అనేకమంది క్రికెట్ ఫ్యాన్స్ ఇష్టపడుతారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్‌కు గిల్ బాగా తెలుసు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 70కి చేరుకోవడానికి గిల్ సహకారం ఉపయోగపడుతుంది. 'ఈసారి 70శాతం పైగా' నినాదంతో ఓటర్లకు అవగాహన కల్పించే ప్రచారంలో గిల్ పాల్గొంటాడు' అని సిబిన్ సీ తెలిపారు. కాగా, గిల్ పంజాబ్‌లోని ఫిరోజ్పుర్లో జన్మించాడు. ఇక గిల్‌తోపాటు ప్రముఖ పంజాబీ సింగర్ తర్సీమ్ జాస్సర్ను కూడా 'స్టేట్ ఐకాన్' నియమించినట్లు సిబిన్ తెలిపారు. కాగా, 2019లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాలకు ఎన్నిక జరగ్గా రికార్డు స్థాయిలో 65.96 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 70శాతం పోలింగ్‌ను ఎలక్షన్ కమిషన్ టార్గెట్‌గా పెట్టుకుంది.