Sheetal Devi Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో వివిధ వైకల్యాలు ఉన్న వాళ్లుకున్న ఎన్నో సవాళ్లను దాటి రాణిస్తున్నారు. అయితే వీళ్లందరికంటే ఆర్చర్ శీతల్ దేవి కథ, కష్టం వేరు. చేతులు లేకున్నా విలు విద్యలో సత్తా చాటి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు ఆమె ఆర్చరీ ఎలా నేర్చుకుందంటే?
ఆనందం ఆవిరి చేసిన ఆ పరిస్థితి
2007 జనవరి 10న జమ్ముకశ్మీర్‌లోని కిష్టావార్ జిల్లాలో జన్మించింది శీతల్. పుట్టగానే ఓ అరుదైన వైద్య పరిస్థితి ఫొకోమెలియా (కాళ్లు, చేతులు తదితర అవయవాలు ఎదగకపోవడం) కారణంగా ఆమె రెండు చేతులు లేకుండానే పుట్టింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం ఆవిరైపోయింది. అయితే తన పరిస్థితిని చూసి కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. కాళ్లతోనే చెట్లు ఎక్కి అందరినీ అబ్బురపరిచేది. ఎన్నో పనులను తనంతట తాను చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
అవకాశం వచ్చినా సాధ్యం కాలేదు
అయితే 2021లో సైన్యం నిర్వహించిన ఓ కార్యక్రమం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అక్కడి సైనికులు నిర్విహించిన ఓ క్రీడాపోటీల్లో ఆమె తన ప్రతిభ చూపించింది. దీంతో అక్కడి ఆర్మీ కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్‌దీప్ వాధ్వాన్‌ను ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఆర్చరీలో శిక్షణ ఇద్దామని అనుకున్న సమయంలో వైద్యులు కృత్రిమ చేతులు పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. ఇది కూడా ఆమెకు ఓ ఎదురుదెబ్బలా తగిలింది. కానీ ఇవన్నీ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది.