Rohit Sharma Star Sports Controversy :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్‌ను తిట్టిపోశాడు. వద్దన్నా కూడా అనవసరంగా వీడియోలు తీసి తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ సమయంలో, మ్యాచ్ అయిపోయాక స్టేడియంలో తమ సహచరులతో మాట్లాడుకున్న వాటిని వీడియో తీసి వాటిని అప్లోడ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"క్రికెటర్ల జీవితాలు ఎలా మారిపోయాయి అంటే ఇప్పుడు మేము వేసే ప్రతి అడుగు, స్నేహితులు లేదా సహచరులతో పంచుకునే విషయాలన్నింటిని కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. నేను మాట్లాడే దాన్ని రికార్డ్ చేయొద్దన్ని స్టార్ స్పోర్ట్స్‌ను కోరినప్పటికీ, వాళ్లు నా ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించారు. దాన్ని టెలికాస్ట్ చేశారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో పాటు వ్యూవ్స్‌ను సాధించే విషయంపై దృష్టి పెట్టాలనుకే ఆలోచన ఒకరోజు క్రికెటర్లకు అలాగే ఫ్యాన్స్‌కు మధ్య ఉన్న నమ్మకాన్ని పోయేలా చేస్తుంది." అంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక రోహిత్ ట్వీట్ చూసిన అభిమానులు, సదురు ఛానెల్ చేసిన పని సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్‌కు మద్దతు తెలుపుతున్నారు.
అసలేం జరిగిందంటే ?
ఐపీఎల్లో భాగంగా లఖ్‌నవూ, ముంబయి మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణి, రోహిత్ ముచ్చటించారు. అదే సమయంలో అక్కడి ఓ కెమెరామెన్ వాళ్లు వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని రోహిత్ గమనించాడు. వెంటనే అతడు కెమెరామన్‌ను రోహిత్ సరదాగా రిక్వెస్ట్ చేశాడు. "బ్రదర్, దయచేసి ఆడియో ఆఫ్ చేయండి. ఇప్పటికే ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి" అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే వీడియోను స్టార్స్ స్పోర్ట్స్ తమ ఛానల్లో ప్రసారం చేసింది.