Rohit Sharma Captaincy Mantra : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక మంది మాజీల ప్రశంసలను కూడా అందుకుంటున్నాడు. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ జట్టును వరుసగా 10 మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే గ్రౌండ్లో తన వ్యూహాలు ఎలా ఉంటాయి? ప్లేయర్లను ఎలా మేనేజ్ చేస్తాడు? అనే పలు ఆసక్తికర అంశాలపై హిట్ మ్యాన్ తాజాగా ఓ స్పోర్చ్ ఛానెల్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
'ఓ కెప్టెన్‌గా నేను చాలా వరకు డేటాపై ఆధారపడి పని చేస్తాను. దాన్ని విశ్లేషించి ఆ తర్వాత జట్టుకు తగ్గట్లుగా ప్లాన్స్ రెడీ చేసుకుంటాను. కొత్త ట్రెండ్లను గుర్తించడానికి కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. దాని కోసం గంటల కొద్దీ మీటింగ్ రూముల్లోనే గడుపుతుంటాను. ముఖ్యంగా మ్యాచ్‌లో ఊహించని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనేదానిపై కూడా సిద్ధమవుతుంటాను. పరిస్థితులపై అవగాహన ఉండటం చాలా కీలకం. ఇక మైదానంలోకి దిగే సమయానికి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి కూడా నేను రెడీగా ఉంటాను. నా ప్లానింగ్ ఇలానే ఉంటుంది. కానీ, ఇటువంటి విషయాలను చెప్పి జట్టు సభ్యుల మెదళ్లను నింపేయను. ఎవరికి ఏది అవసరమో, ఎంతవరకు ముఖ్యమో అవే చెప్తాను. ఇక ప్రత్యర్థులు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతున్నారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను" అంటూ రోహిత్ పేర్కొన్నాడు.