Rohit Sharma Mumbai Indians :ఐపీఎల్ పోరు కోసం ముంబయి జట్టు సిద్ధమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవలే ముంబయి ఫ్రాంచైజీ కో ఓనర్ ఆకాశ్ అంబానీతో పాటు కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. వాంఖడే స్టేడియం వైపు వెళ్తున్న వారిద్దని చూసేందుకు రోహిత్ ఫ్యాన్స్ ఆతృతగా ముందుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే రోహిత్ ఆకాశ్ కారులో ఎందుకు వెళ్లారన్న విషయం గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ చర్చిస్తున్నారు. ఫ్రాంచైజీకి సంబంధించిన కీలక విషయాల గురించి మాట్లాడటానికి అయ్యుండచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొదరేమో గత మ్యాచ్‌ల గురించి రోహిత్‌తో ఆయన డిస్కస్ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రోహిత్‌కు ఓకే అయితే మేము రెడీ!
ఇదిలా ఉండగా, 2025లో జరిగే మెగా వేలంలో రోహిత్ ముంబయిని వీడనున్నాడని ప్రచారం జరుగుతోంది. రోహిత్ ఈ వేలంలోకి వస్తే అతడ్ని తీసుకుని కెప్టెన్‌ను చేయాలని చాలా ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ రోహిత్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ముంబయి ఇండియన్స్ ఒప్పుకుంటే తాము తమ జట్టులోకి రోహిత్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ లాంగర్ పేర్కొన్నాడు.