Ravindra Jadeja England Series :ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఓటమిని చవిచూసిన భారత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కాగా, గాయాల కారణంగా ఇప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం కానున్నాడు. ఇతడితో పాటు వెటరన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. తొలి టెస్టులో సింగిల్ తీసే సమయంలో జడేజా తొడ కండరాలకు గాయమైంది. దీంతో ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌లో అకాడమీలో అతడు చికిత్స పొంది కోలుకుంటున్నాడు. అయితే రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు కూడా జడ్డూ అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జడేజా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమచారం. ఒకవేళ జడ్డూ ఫిట్‌నెస్ సాధిస్తే రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు అతడు తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఎన్‌సీఏలో కేఎల్ రాహుల్ - మూడో టెస్టుకి ఎంట్రీ :
రెండు టెస్టులకు దూరంగా ఉన్న టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్కేఎల్ రాహుల్ మాత్రం మూడో టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. ఇటీవలే జరిగిన తొలి టెస్టు సమయంలో కుడి తొడ నొప్పితో బాధపడుతున్నట్లు అతడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రెండో మ్యాచ్‌కు రాహుల్‌కు విశ్రాంతినిచ్చారట. అయితే మూడో టెస్టు నాటికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి, . మహ్మద్ షమి ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకూ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడు చీలమండ గాయం వల్ల బాధపడుతున్నాడు. ఇక టీమ్ఇండియా స్టార్ పేసర్ మమ్మద్ షమి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. అతడు తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంటాడా, లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.