Rafael Nadal Announces Retirement : టెన్నిస్ దిగ్గం రఫెల్ నాదల్ తాజాగా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌లో డేవిస్ కప్ ఫైనల్స్‌లో చివరి ప్రదర్శన చేసిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అభిమానులకు షాకిచ్చారు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఆటకు వీడ్కోలు పలుకుతానంటూ ప్రకటించాడు.
"నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత రెండేళ్లు నాకు ఎంతో కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ, జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుంది" అంటూ నాదల్ పేర్కొన్నాడు. గత నెలలో జరిగిన లేవర్ కప్ నుంచి తప్పుకొన్నాడు. 38 ఏళ్ల నాదల్ చివరగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. సింగిల్స్‌లో రెండో రౌండ్లోనే జకోవిచ్ చేతిలో ఓడాడు. డబుల్స్‌లో అల్కరాస్‌తో కలిసి క్వార్టర్స్ వరకూ వెళ్లాడు.
2005 నుంచే టైటిళ్ల వేట
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ టైటిళ్ల వేట 2005లో మొదలైంది. ఆ తర్వాత నుంచి అతడికి ఈ ఆటలో తిరుగే లేకుండా పోయింది. అలా 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022లోనూ ఈ స్టార్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఇతర గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సత్తా చాటిన నాదల్, తన కెరీర్‌లో మొత్తం 22 మేజర్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్ అంటే నాదల్, నాదల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ అన్నట్లుగా క్రీడాభిమానులను అలరించాడు రఫెల్ నాదల్. అతడి కంచుకోటలో ఊహకందని రీతిలో అతడు ఏకంగా 14 టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవలె జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలిసారి రొలాండ్ గారోస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అతడు, ఇలా తొలి రౌండ్లో కంగుతినడం విచిత్రంగా అనిపించిందని అభిమానులు అంటున్నారు.