Rafael Nadal loses Farewell Match : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తన కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. డేవిస్ కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమిపాలవ్వడం వల్ల రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్‌లో ఓటమితో సుదీర్ఘ కెరీర్‌ను ప్రారంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించాడు. కాగా, డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని నాదల్ అక్టోబర్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపై చూసే అవకాశం లేనట్టే! - ఈ డేవిస్ కప్ సమరంలో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్ల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టి మాత్రం నాదల్‌పైనే నిలిచింది. కోర్టులో అతడు ఆడిన ప్రతి షాట్‌ను, ప్రతి కదలికను ఎంతో ఆసక్తిగా, ఎంతో ఇష్టంగా తిలకించారు ఫ్యాన్స్. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆ యోధుడి ఆటను ఇకపై చూసే అవకాశం లేకపోవడమే. అతడికిదే చివరి మ్యాచ్. అందుకే ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా అతడిని ఆటను వీక్షించారు.
నాదల్ కూడా తీవ్ర భావోద్వేగాల మధ్యే ఈ ఆట బరిలోకి దిగాడు. కానీ ఒకప్పటి ఫిట్‌నెస్, ఫామ్ లేని కారణంగా అతడు తొలి సింగిల్స్‌లో మ్యాచ్‌లోనే పరాజయాన్ని అందుకున్నాడు. నాదల్ 4-6, 4-6తో బొటిక్ వాన్‌డి జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.