Preity Zinta IPL 2024 : అది 2023 డిసెంబర్. ఐపీఎల్ 17వ సీజన్ కోసం మినీ వేలం జరుగుతున్న సమయం. ఎంతో ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న ఈ వేలంలో పోటా పోటీగా ఫ్రాంచైజీలు ప్లేయర్లను ఎంచుకుంటోంది. అయితే ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ కో ఓనర్ బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఓ తప్పిదం చేశారు. ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో వల్ల ఓ యంగ్ ప్లేయర్‌కు బదులుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను ఎంచుకున్నారు. అతడ్ని రూ. 20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే ఇదంతా జరిగిన కొద్ది సేపటి తర్వాత పంజాబ్ ఫ్రాంచైజీ ఆ తప్పిదాన్ని గుర్తించింది. కానీ చేసేదేం లేక దాన్ని కప్పిపుచ్చుకుంది.
అయితే అప్పుడు వాళ్లు చేసిన తప్పిదం ఇప్పుడు వాళ్లకు ఓ వరంలా మారింది. ఏ ప్లేయర్‌ను అయితే వద్దనుకున్నారో అతడే మ్యాచ్‌లో దుమ్మురేపుతున్నాడు. మెరుగైన పెర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం (మార్చి 25)న ఆర్సీబీతో జరిగిన పోరులో శశాంక్ తన భారీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 19 ఓవర్లకే 6 వికెట్స్ కోల్పోయిన పంజాబ్ జట్టుకు అండగా నిలిచాడు.ఫోర్లు, సిక్సర్లు బాది ఒకే ఓవర్లో 20 పరుగులు సాధించాడు. అయితే అతడి పోరాటం వృథా అయిపోయింది. హోరా హోరీగా జరిగిన పోరులో ఆర్సీబీదే పై చేయిగా నిలిచింది. అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి శశాంక్‌పై పడింది. అతడి ఆట తీరును కొనియాడుతున్నారు. పంజాబ్ జట్టుకు మంచి ప్లేయర్ దొరికాడంటూ కామెంట్లు పెడుతున్నారు.