World Cup Squad Performance:2024 టీ20 వరల్డ్‌కప్‌కు బీసీసీఐ రీసెంట్గా 15మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. పొట్టికప్‌కు ఎంపికైన ప్లేయర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నారు. అయితే మెగా టోర్నీలో బెర్త్ కన్ఫార్మ్ అయ్యాక ఆ ప్లేయర్‌ల ఆటతీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమ్ ఇండియా వరల్డ్‌కప్ టీమ్‌ని అనౌన్స్ చేసిన తర్వాత, ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో జట్టులోని దాదాపు 10 మంది సభ్యులు విఫలమయ్యారు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
బ్యాటింగ్‌లో వీళ్లు
రానున్న వరల్డ్‌కప్‌కు ఒక్క ముంబయి ఇండియన్స్ జట్టనుంచే నలుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. ప్రపంచకప్ టీమ్ అనౌన్స్మెంట్ తర్వాత కెప్టెన్ రోహిత్ (5 పరుగులు) సహా, సూర్యకుమార్ యాదవ్ (10 పరుగులు) స్వల్ప స్కోర్లకు పెవిలియన్ చేరారు. కాగా రీసెంట్గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ కూడా విఫలమయ్యాడు. శాంసన్ ఏకంగా డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆల్‌రౌండర్ల ప్రదర్శన
ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య, 2024 వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్ బాధ్యత మోయనున్నాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోతున్న పాండ్య టీమ్ అనౌన్స్మెంట్ తర్వాత మెరుగ్గా ఆడతాడని ఆశించారు. కానీ, పాండ్య ఆట తీరు మారలేదు. లఖ్‌నవూ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో (0) డకౌట్ కాగా, బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక మరో ఆల్‌రౌండర్ బ్యాటర్ శివమ్ దూబే కూడా రీసెంట్గా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్‌లో దూబే కూడా (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో 1 వికెట్ తీసి 14 పరుగులు ఇచ్చాడు. అటు రవీంద్ర జడేజా కూడా పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్‌లో 2 పరుగులే చేసి, బౌలింగ్‌లో 3 ఓవర్లలో వికెట్ తీయకుండా 22 పరుగులు ఇచ్చాడు.