Philippines Olympic Gold Medalist:విశ్వ క్రీడల్లో ఒలింపిక్ పతకం గెలవడం ప్రతీ అథ్లెట్ కల. అలాంటి ఘనతే సాధించాడు ఫిలిప్పిన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ ఇ యులో. 24 ఏళ్ల ఈ జిమ్నాస్ట్ రెండు రోజుల వ్యవధిలో రెండు బంగారు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పురుష అథ్లెట్‌గా రికార్డ్ కొట్టాడు. పురుషుల జిమ్నాస్టిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన ఇ యులో, వాల్ట్ రొటీన్‌లోనూ మరో గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. ఈ విజయం సాధించేందుకు ఇయులో ఎంత కష్టపడ్డాడు. ఈ విజయం సాధించడంతో ఇప్పుడు ఇ యులోపై కానుకల వర్షం కురుస్తోంది. కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు ఇ యులోకు భారీగా నజరానాలు ప్రకటిస్తున్నారు. ఈ నజరానాలతో ఇ యులో తడిసి ముద్దవుతున్నాడు.
ప్రభుత్వం నుంచి కంపెనీల దాకా
ఫిలిప్పిన్స్ ప్రభుత్వం బంగారు పతక విజేత ఇ యులోకు 10 మిలియన్ ఫిలిప్పిన్ పెసోలను నజరానాగా ప్రకటించింది. ఇది లక్షా 73 వేల డాలర్లకు సమానం. ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాకు సమీపంలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున తాము వేడుకలు జరుపుకునేందుకు ఇంతకన్న గొప్ప సందర్భం లేదని అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఫిలిప్పిన్స్ 1924లో తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంది.
నజరానాలే నజరానాలు
ఇ యులోకు పలు కంపెనీల ద్వారా అదనంగా మరో ఆరు మిలియన్ పెసోలు ప్రైజ్‌మనీ అందనుంది. వివిధ చైన్ రెస్టారెంట్లు కూడా ఈ స్టార్ జిమ్నాస్ట్‌కు రామెన్, మాకరోనీ, చీజ్, గ్రిల్డ్ చికెన్ల రెసిపీలను జీవితకాలం ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాయి. ఇ యులోకు ఘన స్వాగతం పలికేందుకు కూడా అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కంపెనీలతోపాటు యూనివర్శిటీలు కూడా యులోకు పారితోషికం ఇచ్చేందుకు క్యూ కట్టాయి. మిండానావో విశ్వవిద్యాలయం ఇ యులో ట్యూషన్ ఫీజును రద్దు చేసింది.