Pakisthan Cricket Players Salary per Month : పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ప్లేయర్ల జీతాల వివరాలను తెలిపింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ). అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆటగాళ్ల జీతభత్యాలను భారీగా పెంచినట్లు పేర్కొంది. కేటగిరి ఏలో కొనసాగుతున్న పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్, పేసర్ షహీన్ అఫ్రీది, వికెట్ కీపర్, బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌లకు నెలకు రూ.45 లక్షల వరకూ చెల్లించనున్నట్లు వెల్లడించింది. వారి గత జీతాలతో పోలిస్తే ఇది 200 శాతం ఎక్కువ.
కేటగిరీ ఏ ప్లేయర్ల జీతాలు మాత్రమే కాదు, కేటగిరి బీలో ఉన్న ప్లేయర్లు షాదబ్ ఖాన్, ఫఖార్ జమాన్, హ్యారీస్ రౌఫ్. పేసర్ నసీమ్ షాలకు 144 శాతం హైక్‌తో నెలకు రూ. 30 లక్షలు చెల్లిస్తోందట. కేటగిరీ సీ, కేటగిరీ డీలో ఉన్న ప్లేయర్లు ఇమద్ వసీం, ఇఫ్తికర్ అహ్మద్‌ల జీతాలను 127-135 శాతానికి పెంచింది. నెలకు రూ.7లక్షల 50వేలు అందుకునే వారిని రూ.15లక్షల స్థాయికి చేర్చింది.
Pakisthan Players Central Contract :వాస్తవానికి ఈ సెంట్రల్ కాంట్రాక్ట్, దానికి అనుగుణంగా వారి జీతాలను పెంచబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. జీతంతో పాటుగా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లకు అదనంగా బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయి. ప్లేయర్లకు జీతాలు పెంచడంలో భాగంగా వారిపై పూర్తి సమీక్ష నిర్వహించి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వారికే తొలి ప్రాధాన్యమిచ్చారు.