Paris Olympics 2024 Shooting :పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్, సరబ్ జోత్ సింగ్ అరదగొట్టారు. సౌత్‌కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించారు. స్వాతంత్య్రంతర్వాత ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ చరిత్రకెక్కింది.
భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని మను బాకర్ అందించింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌత్‌కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజత పతకాన్ని సాధించారు.
'షూటర్లు మరోసారి మనల్ని గర్వించేలా చేశారు'
భారత్‌కు మరో పతాకాన్ని అందించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. "షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు! ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మనుబాకర్ అలాగే సరబ్ జోత్ సింగ్‌లకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యంతో పాటు జట్టు కృషిని ప్రదర్శించారు. భారత ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మనుకి ఇది వరుసగా రెండవ ఒలింపిక్ పతకం. ఆమె స్థిరమైన నైపుణ్యంతో పాటు ఆమె అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది." అంటూ మోదీ ట్వీట్ చేశారు.