2024 Paris Olympics Security:పారిస్ ఒలింపిక్స్ 2024 విశ్వ క్రీడల సంరంభానికి సమయం దగ్గరపడుతోంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్న పారిస్, విశ్వ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు 180+ దేశాల నుంచి అథ్లెట్లు పారిస్‌కు రానున్నారు. ఇక వివిధ దేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రత్యక్షంగా ఒలింపిక్స్ క్రీడలు వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్రీడల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం ఫ్రాన్స్ ఇప్పటికే, భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఒలింపిక్స్ భద్రత కోసం భారత ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కే- 9 జాతి శునకాలను పారిస్‌కు పంపింది. ఈ శునకాలు ఇప్పటికే పారిస్‌లో భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.
పటిష్ఠ భద్రత
ఒలింపిక్స్ క్రీడలను ప్రశాతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో భద్రత కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. 2004 తర్వాత నిర్వహించిన ప్రతీ ఒలింపిక్స్‌లోనూ భద్రత కోసం ఖర్చు 1 బిలియన్ డాలర్ నుంచి 2 బిలియన్ డాలర్ల మధ్య ఖర్చు పెడుతున్నారు.
ఇక కొవిడ్ సమయంలో ఒలిపింక్స్ ఆతిథ్య హక్కులు పొందిన జపాన్ కేవలం కరోనా పరీక్షలు, క్వారంటైన్‌ల కోసమే 2.8 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ క్రమంలో 2024 ఆతిథ్య హక్కులు పొందిన పారిస్ కూడా భద్రత కోసం భారీగా నిధులు కేటాయించింది. పారిస్‌లో భద్రత కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. టెర్రరిస్టుల ప్రత్యేక స్థావరాలను గుర్తించే సామర్థ్యం ఉన్న బెల్జియన్ మలినోయిస్ జాతి శునకాలను పారిస్‌లో మోహరించారు. ఈ జాతి శునకాలు ఏదైనా అనుమానాస్పద ఉనికిని చాలా వేగంగా గుర్తిస్తాయి.
రోజుకు 35 వేలమందితో
పారిస్‌లో రోజుకు 30,000 మంది పోలీసు అధికారులతో భద్రత కల్పిస్తున్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య రోజూ దాదాపు 30,000 మంది పోలీసు అధికారులను మోహరిస్తోంది. సీన్ నదిలో ప్రారంభమయ్యే వేడుకల కోసం 45,000 మందితో భద్రత కల్పిస్తున్నారు. రోజూ కనీసం 35,000 నుంచి 45,000 మంది భద్రత సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు .